||సుందరకాండ ||

||ఏభై ఎనిమిదవ సర్గ తెలుగులో||

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| తతః తస్య గిరేః శృజ్ఞ్గే మహేన్ద్రస్య మహాబలాః|
హనుమత్ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమామ్||1||
స|| తతః మహాబలాః హనుమత్ప్రముఖాః హరయః తస్య మహేన్ద్రస్య గిరేః శృంగే ఉత్తమమ్ ప్రీతిం జగ్ముః||
తా|| అప్పుడు మహాబలురైన హనుమత్ప్రముఖులు తదితర వానరులు ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాలలో అనిర్వచనీయమైన అనందము పొందిరి.
|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టపంచాశస్సర్గః||

అప్పుడు హనుమంతుడు లంకనుంచి విజయవంతముగా తిరిగి వచ్చిన సందర్భములో మహాబలురైన హనుమత్ప్రముఖులు తదితర వానరులు ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాలలో అనిర్వచనీయమైన అనందము పొందిరి.

అప్పుడు ప్రీతితో అనందభరితుడైన జాంబవంతుడు అనందభరితుడైన అనిలాత్మజుడు అయిన మహాకపి హనుమంతుని జరిగిన కార్యముగురించి ఇట్లు అడిగెను. " ఓ హనుమా ! నీవు ఆ దేవిని ఏట్లు చూచితివి? ఆమె అచట ఏట్లు ఉన్నది? క్రూరకర్ముడైన ఆ దశాననుడు అమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఓ మహాకపీ ఇదంతా నీవు జరిగినది జరిగినట్లు చెప్పుము. విని అర్థము చేసికొని మనము తరువాత కార్యముగురించి అలోచించుదము. వానరాధిపతి దగ్గరకు వెళ్ళి మనము ఏది చెప్పతగునో ఏది రక్షింపతగునో అది నీవు నిర్ణయించి మాకు చెప్పుము."

అపుడు ఆవిధముగా జాంబవంతునిచేత అడగబడి తనువు అంతా అనందముతో పులకితుడైన హనుమంతుడు ఆ దేవి సీతకు ఆ దిశలో శిరస్సు వంచి నమస్కరించి చెప్పసాగెను.

'సాగరముయొక్క దక్షిణతీరము చేరగోరి మహేంద్రపర్వతము నుంచి అకాశము లోకి ఎగురుట ఆ మహేంద్ర పర్వతము మీద సమాహితులైన మీరందరి మీరందరి ముందరనే జరిగినది.అలా ఆకాశములో వెళ్ళుతున్న నాకు ఘోరమైన విఘ్నము అయినట్లు అనిపించెను. ఆకాశమార్గములో నేను దివ్యమైన సుందరమైన కాంచన శిఖరములు చూచితిని. దారిలో నిలబడి వున్న ఆ పర్వతమును విఘ్నముగా భావించితిని. దివ్యమైన బంగారపు పర్వతమును సమీపించి అది ముక్కలు చేయతగును అని మనస్సులో భావించితిని. నా యొక్క లాంగూలముతో కొట్టబడి, ఆ మహాపర్వతముయొక్క సూర్యునితో సమానముగా ప్రకాశిస్తున్న శిఖరము వేయిముక్కలుగా అయినది. ఆ మహాపర్వతము ఆ కార్యమును గ్రహించి మనస్సుతో ప్రీతిపొందినవాడై "పుత్రా" అని మధురమైన మాటలతో నాతో ఇట్లు పలికెను.

"మైనాకుడను పేరుతో విఖ్యాతిపొంది సముద్రములో నివశిస్తున్న నేను నీ తండ్రియొక్క సఖుడను. నన్ను నీ పినతండ్రిగా తెలిసికొనుము. ఓ కుమారా పూర్వకాలములో పర్వతోత్తములు రెక్కలుగాకలవై తిరుగుతూ ఉండెడివి. ఆ పర్వతములు శ్వేచ్ఛగా అన్నిచోటలా తిరుగుచూ భూమికి బాధలను కలిగిస్తూ వుండెడివి. ఆ తిరుగుతున్న పర్వతముల గురించి విని పాకశాసనుడగు మహేంద్రుడు తన వజ్రాయుధముతో వేలకొలదీ పర్వతపు రెక్కలను కొట్టివేసెను. నేను నీ పిత్రుడైన వాయుదేవునిచే మహేంద్రుని వజ్రాయుధము నుంచి రక్షింపబడితిని. ఓ కుమారా అప్పటినుంచి సాగరములో దాగినవాడను అయితిని. ఓ అరిందమ ! నేను రామునికి సహాయము చేయ తగును. రాముడు ధర్మము ఆచరించువారిలో శ్రేష్ఠుడు, మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు".

హనుమంతుడు చెప్పసాగెను.

'మహత్ముడైన ఆ మైనాకుని వచనములను విని ఆ పర్వతమునకు నా మనస్సులో వున్న రామ కార్యముగురించి నివేదించి, ముందుకు పోవుటకు ఆ మహాత్ముడైన మైనాకును అనుజ్ఞపొందితిని. ఆ మానుషరూపము ధరించిన పర్వతము తనరూపముదాల్చి మహాసాగరములో మరల నిక్షిప్తమాయెను'.

'అప్పుడు నేను మంచి వేగముతో అదే మార్గములో చిరకాలము పోయితిని. అప్పుడు ఆ సముద్ర మధ్యములో నాగమాతయగు సురసా దేవిని చూచితిని. ఆ నాగమాత సురసాదేవి నాతో ఇట్లు పలికెను'.

"ఓ హరిసత్తమా! దేవతలచే నీవు నాకు ఆహారముగా పంపబడితివి. అందువలన నేను నిన్ను భక్షించెదను. నీవు చాలాకాలము తరువాత లభించినవాడవు". సురస చేత ఈ విధముగా చెప్పబడిన నేను ఆమెకు చేతులు జోడించి నిలబడితిని. వివర్ణవదనముతో ఆమెకు రామకార్యము గురించి ఈ మాటలను చెప్పితిని. "శత్రువులను హతమార్చు దశరథ పుత్రుడు రాముడు, భార్య సీత తమ్ముడు లక్ష్మణునితో సహా దండకావనము ప్రవేశించెను. ఆయన భార్య సీత దురాత్ముడైన రావణుని చే అపహరింపబడెను. నేను ఆయన దూతను. రాముని శాసనముతోవెళ్ళుచున్నవాడను. ఓ దేవీ రామునికి ఈ విషయములో సహాయము చేయతగిన దానవి. అది కానిచో రామునియొక్క మైథిలిని చూచి తిరుగు ప్రయాణములో నీ నోటిలోకి వచ్చెదను. నేను సత్యము చెప్పుచున్నవాడను".

'నాచేత ఈ విధముగ చెప్పబడి ఇచ్ఛానుసారముగా రూపములు ధరించగల ఆ సురసాదేవి ఇట్లు పలికెను. "నా ఈ వరమును ఎవరూ దాటలేరు". సురస చే ఈ విధముగా చెప్పబడి నేను క్షణములో పది యోజనములు పొడవు దానిలో సగము వెడల్పు పెరిగితిని. ఆమె తన నోటిని నా ప్రమాణమునకు అణుగుణముగా పెంచెను. అలా పెరిగిన ఆమె నోటిని చూచి నా శరీర ప్రమాణమును చిన్నదిగా చేసితిని. క్షణములో అంగుష్ఠమాత్రుడను అయిన నేను, ఆమె నోటిలో ప్రవేశించి క్షణములో బయటకు వచ్చితిని. అప్పుడు సురసా దేవి తన స్వరూపము ధరించి మరల నాతో ఇట్లు పలికెను'.

"ఓ సౌమ్యుడా ! వానర శ్రేష్ఠుడా ! నీ కార్యము సిద్ధించును. సుఖముగా పొమ్ము. మహాత్ముడగు రాఘవునితో వైదేహి ని చేర్చుము. వానరుడా మహాబలుడా సుఖముగా ఉండుము. నీతో నేను చాలా సంతుష్టురాలను అయితిని". అప్పుడు నేను సమస్త ప్రాణులచేత "బాగు బాగు" అని ప్రశంసించబడితిని. పిమ్మట నేను గరుడుని వలె అంతరిక్షములో ఎగురుతూ పయనించితిని.'

హనుమంతుడు చెప్పసాగెను.

'అలా ఆకాశమార్గములో పోవుచున్న నా నీడ ఎవరో ఎలాగో పట్టుకొనిరి. కాని నాకు ఏమి కనపడలేదు. వేగము పోయిన నేను నా కదలికని ఎవరు అపహరించితిరా అని పది దైక్కులూ చూచితిని. కాని ఏమీ కనపడ లేదు. అప్పుడు నాకు మనస్సులో అనిపించెను ," ఆకాశములో నన్నుఎవరు తనరూపము కనపరచకుండా ఈ విధమైన విఘ్నము కలిగించిరి అని". ఆవిధముగా ఆలోచిస్తూ క్రింద భాగములో నాదృష్టిని ప్రసరించితిని. అప్పుడు ఆ సలిలాశయములో మహా భయంకరమైన ఒక రాక్షసిని చూచితిని. భయంకరమైన ఆ రాక్షసి మహానాదముచేసి, గట్టిగా నవ్వి ఈ అశుభకరనైన వాక్యములను నాతో పలికెను. " ఓ బలసిన శరీరము కలవాడా ఎక్కడికి పోవుచున్నావు. అకలితోవున్న దానిని. చాలాకాలము ఆహారముతినని నాకు, నిన్ను తినుటకు కోరిక ఉన్నది. నాదేహమునకు ప్రీతి కలిగించుము."అని'.

'నేను సరేనని ఆ పలుకుచున్నదాని నోరు పట్టనంతగా నా శరీరప్రమాణమును పెంచితిని. దాని ప్రమాణముకన్న అధికముగా నా శరీరము పెంచితిని. అమె తన యొక్క భయంకరమైన నోరును నన్ను భక్షించుటకు తెరచెను. పెరుగుచున్నఆమెకు నా గురించిగాని, నా పన్నుగడ గురించి కాని ఏమీ తెలియదు. అప్పుడు క్షణములో నా విపులమైన ప్రమాణము తగ్గించి, అమె లోకి ప్రవేశించి, హృదయము పెకలించి ఆకాశములోకి ఎగిరిపోయితిని'.

'భయంకరమైన పర్వతము తో సమానమైన ఆమె , నాచేత హృదయముపెకలింపబడినదై, చేతులు వేలాడేసుకొని సముద్రములో పడిపోయెను. అపుడు చారుణులతో సహా ఆకాశములో వశించు సిద్ధులు భయంకరమైన రాక్షసి సింహిక హనుమంతుని చే హతమార్చబడినది అని అనడము వింటిని'.

'నేను ఆమెను హతమార్చి మరల ఆ చేసిన కార్యమునే స్మరించుచూ, చాలాదూరము పయనించి, ఎక్కడ లంకాపురికలదో అక్కడ ఆ సముద్రముయొక్క దక్షిణ తీరము చూచితిని. దినకరుడు అస్తమించిన తరువాత, భయంకర పరాక్రమము గల ఆ రాక్షసులకు తెలియకుండా, నేను ఆ లంకా పురములో ప్రవేశించితిని'.

'అక్కడ ప్రవేశించుచుండగా, ప్రలయకాలమేఘములను బోలిన ఒక స్త్రీ, అట్టహాసము చేస్తూ ఎదురుగా లేచి నిలబడెను. అప్పుడు మండుతున్న అగ్నిలాంటి ఎర్రని కేశములు గల ఆ రాక్షసి నన్ను కొట్టుటకు ప్రయత్నించగా, ఎడమ చేతి పిడికలతో కొట్టి ఆమెని పరాజించితిని. ప్రదోషకాలములో లంకా నగరములో ప్రవేశించుతున్న నాతో, భయపడిన ఆ రాక్షసి ఇట్లు పలికెను. "ఓ వీరా! నేను లంకాపురిని. నీ పరాక్రమము చేత జయించబడితిని. అందువలన నీవు రాక్షసులందరిని నిశ్శేషముగా జయించెదవు"అని'.

హనుమంతుడు ఇంకా చెప్పసాగెను.

'నేను అప్పుడు ఆ రాత్రి అంతా రావణాంతః పురములో జనకాత్మజను వెతుకుతూ వెళ్ళితిని. కాని ఆ సుమధ్యమ కనపడలేదు. అప్పుడు రావణుని నివేశములో సీత కనపడక పోవడముతో , తీరము లేని శోకసాగరములో పడిపోతిని. అలా అలోచనలో ఉన్న నేను బంగారపు ప్రాకారములు కల ఉత్తమమైన ఉపగృహమును చూచితిని.అదియే అశోకవనము. ఆ ప్రాకారము దాటి అనేక వృక్షములను చూచితిని. ఆ అశోకవనిక మధ్యలో ఒక మహత్తరమైన శింశుపా వృక్షము కలదు. అది ఎక్కి బంగారపు కదళీ వనము చూచితిని".

' శింశుపా వృక్షమునకు దగ్గరే, ఆకర్షణీయమైన మంచి వర్ణముకల, కలువరేకులవంటి కళ్ళుగల, ఉపవాసములచే కృశించిన శరీరముకల, ఒకే గుడ్డను ధరించిన, ధూళితోకప్పబడిన శిరోజములతోనున్న, శోకసంతాపములలో ములిగివున్న, కౄరులు వికృత రూపము గలవారు, ఆడ లేడిని ఆడపులులు చుట్టుముట్టూనట్టిగా, రక్త మాంసభక్షకులు చేత చుట్టముట్టబడిన సీతను చూచితిని. ప్రతి క్షణము భయపెట్టబడుచున్న , ఒకేజడవేసికుని ఉన్న, భర్తను గురించే అలోచనలో ఉన్న, భూమి మీద పడుకొని వివర్ణ వదనము కల మంచుపడిన పద్మము వలెనున్న , రావణునిపై అసహ్యభావముతో మరణించుటకు నిశ్చయము చేసికొనివున్న, ఆడలేడి వంటి చూపులు గల ఆ సీతాదేవిని, రాక్షసస్త్రీల మధ్య ఎలాగో అదృష్టము కొలదీ చివరికి చూడకలిగితిని'.

'నేను అలాంటి యశోవంతురాలైన స్త్రీని రామ పత్నిని చూచి ఆ శింశుపా వృక్షములోనే ఉంటిని.'

హనుమంతుడు చెప్పసాగెను

'అప్పుడు రావణాంతఃపురము నుండి వడ్డాణాలకున్న మువ్వల, కాలి అందెల సవ్వడులతో కలిసిన పెద్ద గంభీరమైన కోలాహలం విన్నాను. అప్పుడు కలవరపడి నేను వళ్ళు కుదుచ్చుకొని శింశుపా వృక్షములోనే పక్షి వలె ఉండిపోయాను. అప్పుడు మహాబలుడైన రావణుడు తన భార్యలతో సహా, ఎక్కడ సీత ఉన్నదో ఆ ప్రదేశమునకు వచ్చెను.

అప్పుడు ఉత్తమురాలైన సీత, ఆ రాక్షస గణములకు అధిపతి అయిన వానిని చూచి తన బాహువులను భుజములను ముడుచుకొని తన స్తనములను దాచుకొనెను. భయముతో వణికిపోతున్న, అటూ ఇటూ చూచుచూ తనను రక్షించువారు కనపడక వణికిపోతూవున్న, పరమ దుఃఖములో ఉన్న, తపస్విని అయిన ఆ సీతతో, దశకంఠుడు ఇట్లు పలికెను. ' ఓ సీతా నన్ను నమ్మి అంగీకరించుము. గర్వముతో ఓ సీతా ! నన్నునిరాకరిస్తే రెండుమాసముల తరువాత నీ రక్తము చూచెదను' అని.

'దురాత్ముడైన ఆ రావణుని యొక్క మాటలను విని పరమ కోపముతో సీత ఉత్తమమైన మాటలను చెప్పెను'.

"ఓ రాక్షసాధమా అమిత తేజసముకల రాముని భార్యను, ఇక్ష్వాకుకుల నాథుడైన దశరథుని కోడలిని అగు నాతో, మాటలాడతగని మాటలు మాట్లాడిన నీ నాలిక ఎలా ముక్కలు కాలేదు? అనార్యుడా, పాపుడా, భర్త లేని సమయములో నన్ను అపహరించి, మహాత్ముడైన ఆయన చూడకుండా వచ్చిన నీ వీరత్వము ఎలాంటిది? నీవు అయనకి దాసుడవు గా కూడా తగవు. రాఘవుడు యాగములు చేసినవాడు. సత్యము పలుకువాడు. యుద్ధములో జయింపబడనివాడు".

జానకిచేత ఈ విధమైన పరుషవాక్యములు చెప్పబడినవాడై, ఆ దశాననుడు చితిలో లేచిన అగ్నివలే కోపముతో మండిపడెను. ఆ రావణుడు కౄరమైన కళ్ళు తిప్పుతూ ఎడమ చేతిని ఎత్తి, జానకిని కోట్టడానికి తయారు అయినప్పుడు, అతనితో వచ్చిన స్త్రీలు హాహాకారములు చేసిరి. దురాత్ముడైన అతని భార్య మండోదరీ అను పేరుగలది. ఆ స్త్రీల మధ్యలో నుంచి లేచివచ్చి అతనిని ఆపెను. మదముతో వీగుచున్న అతనితో ఆమె మధురమైన మాటలతో మాట్లాడెను. "మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడా సీతతో నీకేమి పని? ఓ ప్రభో ! దేవ గంధర్వ కన్యలతో యక్షకన్యలతో యధేచ్ఛగా రమించుము. సీతతో ఏమి చేస్తావు?"

'అప్పుడు ఆ మహాబలుడు అగు నిశాచరుడు, కలిసివున్న ఆ స్త్రీలందరిచేత ప్రసన్నుడుగా చేసికొనబడి, తన భవనమునకు తీసుకుపోబడెను. ఆ దశగ్రీవుడు వెళ్ళగానే కౄరమైన ఆ రాక్షస స్త్రీలు దారుణమైన మాటలతో సీతను భయపెట్టసాగిర'.

'జానకి వారిచేత చెప్పబడిన మాటలు గడ్డిపఱకల వలె పరిగణించెను. అప్పుడు వారి గర్జనలు నిరర్థకమైనవి. మాంసభక్షకులు అయిన ఆ రాక్షసస్త్రీలు, తమ గర్జనలు నిరరర్ధకము కావడముతో, ఏమి చేయడమో తెలియనివారై, ఆ సీత యొక్క మహత్తరమైన నిశ్చయమును రావణునికి తెలియచేసిరి. పిమ్మట వాళ్ళందరూ ఆశ పోయినవారై నిస్పృహతో నిద్రావశము అయిరి'.

'వారు నిద్రలో ఉండగా ఎల్లప్పుడూ భర్త హితము కోరు అతి దుఃఖములో ఉన్న సీత దీనముగా జాలిగొలుపునట్లు విలపించెన'.

'అప్పుడు వారి మధ్యలో నుంచి లేచి త్రిజట సీతను భయపెట్టుచున్న రాక్షస స్త్రీలతో ఈ మాటలు చెప్పెను. "మీరు మిమ్మలనే తినుకొనుడు. జనకుని కూతురు, దశరథుని కోడలు అగు సీత నాశనము కాదు. ఇప్పుడు నేను దారుణమైన రోమహర్షనము కలిగించు స్వప్నము చూచితిని. ఆ స్వప్నము ఈమె భర్త జయము, రాక్షసుల వినాశము సూచించుచున్నది. ఆ రాఘవుని నుంచి ఈ రాక్షస స్త్రీల గణమును రక్షించుటకు ఈ వైదేహిని ప్రార్ధించెదము. అదే సముచితమని నాకు తోచుచున్నది.జనకాత్మజ అయిన సీత నమస్కరింపబడి ప్రసన్నురాలు అగును" అని'.

"ఎవరైతే దుఃఖములో ఉండి ఈ విధమైన స్వప్నమును చూచెదరో వారు వివిధరకములైన దుఃఖములను బాసి అత్యంత సుఖసౌఖ్యములను పొందుదురు". అప్పుడు సహజముగా సిగ్గుకల ఆ సీత, త్రిజట మాటలతో భర్త విజయము గురించి విని, హర్షముతో ఇట్లు పలికెను. "అది తథ్యము అయితే మీకు శరణు ఇచ్చెదను" అని'.

హనుమంతుడు చెప్పసాగెను.

'నేను సీత యొక్క ఆ దశను చూచి అలోచనలో పడితిని. విక్రాంతుడనైన నా మనస్సు కుదుటపడలేదు. నేను జానకితో సంభాషణ చేయు విధానముగురించి అలోచించి అప్పుడు ఇక్ష్వాకుకుల ప్రశంశ మొదలుపెట్టితిని. ఆ దేవి రాజర్షి గణములను పూజించుచూ చెప్పిన నా మాటలను విని నీళ్ళతో నిండిన కళ్ళతో నాతో మాట్లాడెను. "ఓ వానరపుంగవా నీవెవరవు. ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చితివి. నీకు రామునితో అభిమానము ఏట్లు కలిగెను. అది నాకు చెప్పుటకు తగును".అని'

'ఆమెయొక్క ఆ మాటలను విని నేను కూడా ఇట్లు పలికితిని."ఓ దేవీ సుగ్రీవుడను పేరుగల విక్రాంతుడు వానరేంద్రుడు. నీ భర్తకు సహాయుడు. ఇక్కడికి వచ్చిన నన్ను అయనకి భృత్యుడను అని తెలిసికొనుము. నేను క్లిష్ఠమైన కార్యములు సాధించగల నీ భర్త రామునిచేత నీ కొఱకై పంపబడినవాడను. ఓ యశస్వినీ ! పురుషోత్తముడు, దాశరథి స్వయముగా నీ కొఱకై ఈ అంగుళీయమును గుర్తుగా ఇచ్చెను. ఓ దేవి అది నీకు రాముని ఆజ్ఞకు అనుగుణముగా ఇచ్చుచున్నాను. నేను ఇప్పుడు ఏమి చెయవలెను? నిన్ను రామలక్ష్మణుల దగ్గఱకు తీసుకు వెళ్ళగలను. నీ సందేశము ఏమి?"అని'.

'ఆ జనకనందిని నా మాటలను విని 'రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుపోతగును',అని చెప్పెను'.

'అప్పుడు నేను ఆర్యురా లైన నిందలేని ఆ దేవికి శిరస్సుతో నమస్కరించి రాఘవుని మనస్సుకు అహ్లాదకరమైన గుర్తును కావలెను అని ప్రార్థించితిని. అప్పుడు సీత నా తో ఇట్లు పలికెను. "ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము. దీనితో నీ పై రామునికి అత్యంత ఆదరాభిమానములు కలుగును". ఆ ఉత్తమురాలు ఇలాచెప్పి అద్భుతమైన మణిని ప్రసాదించెను. అతి దుఃఖముతో అమె తన సందేశము కూడా ఇచ్చెను. అప్పుడు ఆ రాజపుత్రికకు నమస్కరించి ఇక్కడికి తిరిగివచ్చు మనస్సుకలవాడనై ఆమెకు ప్రదక్షిణము చేసితిని'.

'అప్పుడు మరల అమె తన మస్సులో చింతించి ఇట్లు చెప్పెను. "ఓ హనుమా, రాఘవునకు నా వృత్తాంతము చెప్పుటకు నీవు తగినవాడవు. వీరులైన వారిద్దరూ నీ మాటలు విన్నవెంటనే సుగ్రీవునితో అచిరకాలములో ఎలావచ్చెదరో అలా చేయుము. అది అలాకాకూండా అయితే నా జీవితకాలము రెండునెలలు మాత్రమే. ఆ కాకుత్‍స్థుడు నన్ను రక్షించకపోతే నేను అనాధను అయ్యెదను'.

'కరుణతో కూడిన ఆ మాటలను విని నాకు కోపము పెల్లుబిక్కెను. అమె తో సంభాషణ తరువాత మిగిలిన కార్యము అలోచించితిని. అప్పుడు యుద్ధకాంక్ష కలవాడినై, నా కాయమును పర్వతముతో సమానముగా చేసితిని. పిమ్మట ఆ వనము నాశము చేయుట ఆరంభించితిని. అప్పుడు వికృతమైన స్వరూపము గల ఆ రాక్షసస్త్రీలు మేల్కొని, భయభ్రాంతులతో బెదిరిన మృగములతో నిండిన, భగ్నము చేయబడుతున్న ఆ వనమును నిరీక్షించిరి'.

'అక్కడ గుమిగూడి ఆ వనములో నన్ను చూచి, వెంటనే రావణునివద్దకుపోయి సమాచారము అందచేసిరి." ఓ మహారాజా, నీ పరాక్రమము తెలియని దురాత్ముడైన వానరుని చేత ఈ దుర్గములోని అశోకవనము భగ్నము చేయబడినది. ఓ రాజేంద్ర ! నీకు అపకారము తలపెట్టిన ఆ దుర్బుద్ధి యొక్క వధకు ఆజ్ఞ ఇమ్ము. వానిని తక్షణమే వధించ తగును".అని

'అది విని ఆ రాక్షసేంద్రుడు దుర్జయులైన భృత్యులను, కింకరులు అను పేరుగలవారిని, జయింపశక్యము కాని వారిని నాపై యుద్ధమునకు పంపెను. ఆ వనములో శూలములు ఉద్గరములు చేతితో పుచ్చుకొని వచ్చిన ఎనభైవేలమంది కింకరులని ఒక ఇనుపగుదియతో హతమార్చితిని. అప్పుడు చావకుండా మిగిలినవారు, పరాక్రమము లేనివారు వెళ్ళి ఆ మహత్తరమైన కింకరుల సైన్యము హతమార్చబడినది అని రావణుని కి చెప్పిరి'.

'అప్పుడు నాకు ఒక బుద్ధి పుట్టెను. చైత్య ప్రాసాదము ఆక్రమించి చేసి , ఒక స్తంభముతో అక్కడవున్న వంద రాక్షసులను హతమార్చితిని. పిమ్మట లంకానగరమునకు అలంకారప్రాయమైన అ చైత్య ప్రాసాదమును ధ్వంసము చేసితిని'.

'అప్పుడు ఘోరమైన రూపముకల, భయము కలిగించు ప్రహస్తుని పుత్రుడు, జంబుమాలి అనేక రాక్షసులతో కూడినవాడై నాతో యుధమునకు రావణునిచేత అదేశింపబడెను. అప్పుడు మహాబలురు రణకోవిదులైన వారిని ఘోరమైన ఇనుప పరిఘతో హతమార్చితిని. అది విని ఆ రాక్షసేంద్రుడు మహాబలము కల పాదరక్షకుల బలగములతో కూడిన మంత్రిపుత్రులను రావణుడు పంపసాగెను. వారిని అందరిని ఆ పరిఘతో యమసాదనమునకు పంపితిని. రావణుడు ఆ మంత్రిపుత్రులు హతమార్చబడిరని విని, ఐదుమంది అగ్ర సేనానాయుకులను యుద్ధమునకు పంపెను. నేను సైన్యములతో సహా వారిని అందరిని హతమార్చితిని'.

'అప్పుడు ఆ దశగ్రీవుడు రావణుడు మహాబలుడైన తన పుత్రుడు అక్షకుమారుని అనేక రాక్షసులతో పంపెను. రణ విద్యలో పండితుడైన ఆ మండోదరీ పుత్రుని, యుద్ధము చేయుటకై ఆకాశములో కి లేచిన ఆ కుమారుని, పాదములు ఒడిసి పట్టుకొంటిని. వానిని వందసార్లు గిరగిరాతిప్పి నేలపై కొడితిని. నేను ఆ రాక్షసపుంగవుని సమస్త బలములను నష్టము చేసి అమితానందము పొందితిని'.

'అప్పుడు మదోన్మత్తుడైన మహాబలుడు రావణునిచేత యుద్ధమునకై మహాబాహువులు కలవాడు అగు ఇంద్రజిత్తు పంపబడెను'.

'ఆ మహాబలుడు ఇంద్రజిత్తు, నన్ను వధింపడము కాదని గ్రహించి, తన బలగములు నాశనమగుట గ్రహించి, అతి వేగముతో నన్ను బ్రహ్మ అస్త్రముతో బంధించెను. అప్పుడు అక్కడ వున్న రాక్షసులు నన్ను తాళ్లతో బందించిరి. నన్ను రావణుని సమీపమునకు తీసుకొని పోయిరి. నేను ఆ దురాత్ముడైన రావణుని చేత చూడబడి వానితో సంభాషణ జరిగెను . నా లంకాగమనము రాక్షసవధలను గురించి రావణునిచేత అడగబడితిని.

"ఓ ప్రభో అది అంతా సీతకొఱకై భగ్నము చేయబడినది, నీ దర్శన కాంక్షతో నీ భవనమునకు వచ్చితిని.నేను మారుతి ఔరసపుత్రుని. వానరుడను హనుమంతుడను. వానరుడనైన నన్ను రామదూత గా సుగ్రీవుని భృత్యునిగా తెలిసికొమ్ము. నేను రామ దూత్యముతో నీ కొఱకై వచ్చితిని. మహాతేజోమయుడైన సుగ్రీవుడు నీ కుశలములు అడుగుచున్న వాడు. ధర్మార్థసహితమైన హితకరమైన ఈ మాటలను చెప్పెను. 'విస్తారమైన వృక్షములతో కూడిన ఋష్యమూక పర్వతముపై నివసిస్తూ రణములో పండితుడైన రాఘవుని మిత్రత్వము పొందితిని. ఓ రాజా రాఘవుడు నాకు ఈవిధముగా చెప్పెను." నా భార్య రాక్షసులచేత అపహరింపబడినది. అక్కడ అన్నివిధములుగా మాకు సహాయము కావలెను". అప్పుడు నేను వాలి వధగురించి అయనకు చెప్పితిని. అచట నాకు సహాయము కావలెను అని. వాలిచేత రాజ్యము కోల్పోయిన సుగ్రీవుడు అగు ఆ మహాప్రభువు , లక్ష్మణుడు రాఘవులతో అగ్ని సాక్షిగా స్నేహము చేసెను".

"అప్పుడు యుద్ధములో రాఘవుడు ఒకే బాణముతో వానరుల ప్రభువు వాలిని వధించిన పిమ్మట సుగ్రీవుడు వానరుల మహారాజు గా చేయబడెను. అప్పుడు మేమూకూడా అన్నివిధములుగా రాఘవునకు సహయము చేయవలెను. అందువలన ధర్మము ననుసరించి నీ దగ్గఱకు ఇతనిని పంపితిని. వీరులైన వానరులు నీ బలములను నాశనము చేయకముందే సీతాదేవిని వేంటనే అప్పగించుము. దేవతల చేత నిమంత్రులై, వారికి యుద్ధములో తోడ్పడిన వానరుల గురించి ఎవరికి తెలియదు?".ఈ విధముగా వానర రాజు సుగ్రీవుడు నీతో చెప్పమని నాకు అదేశమిచ్చెను' అని హనుమ చెప్పెను..

హనుమంతుడు మరల చెప్పసాగెను.

'అప్పుడు రావణుడు కోపముతో కళ్లతోనే నన్ను దహించునా అన్నట్లు నన్ను చూచెను. కౄరకర్మలు చేయు దురాత్ముడైనా ఆ రాక్షస రాజు, నా ప్రభావము తెసికొనకుండా నన్ను చంపమని ఆజ్ఞాపించెను. అప్పుడు అతని తమ్ముడు మహా బుద్ధిమంతుడు విభీషణుడు నా కోసమే ఆ రాక్షసరాజుని ప్రార్థించెను. "ఓ రాక్షసోత్తమా! అలాంటి నిర్ణయము తప్పక వదలవలెను. నీవు పట్టిన మార్గమును రాజశాస్త్రము ప్రకారము కాదు. ఓ రాక్షసరాజా రాజశాస్త్రము ప్రకారము దూతను వధించ రాదు. హితము కోరి వచ్చు దూతలు యదార్థము చెప్పవలెను. ఓ పరాక్రమవంతుడా ఎంత పెద్ద అపరాధము చేసిననూ దూత యొక్క అంగవిరూపము కలిగించడము శాస్త్రములో చెప్పబడినది. కాని దూతవధ ఎక్కడా లేదు".

'విభీషణుని చేత ఈ విధముగా చెప్పబడిన రావణుడు నా లాంగూలము దహించమని ఆ రాక్షసులకు ఆదేశమిచ్చెను'.

'అప్పుడు ఆయన మాటలు విని నా తోక అంతా నారబట్టలూ గుడ్డపీలికల తో కట్టబడినది. అప్పుడు సిద్ధ సన్నాహములు చేసి ఆ కౄర విక్రమముగల ఆ రాక్షసులు, కర్రలతో నన్ను కొట్టుతూ అనేక పాశములతో కట్టి, నా తోకకు నిప్పంటించిరి. అప్పుడూ ఆ శూరులూ రాక్షసులూ నగర ద్వారము వద్దకు నన్ను తీసుకుపోయి రాజవీథులలో ఘోషణ చేసిరి. అప్పుడు నేను నా యొక్క మహత్ రూపమును మరల చిన్నది గా చేసి ఆ బంధములనుంచి విడివడి, నా ప్రకృతి రూపము తో ఆ పరిఘను పట్టుకొని ఆ రాక్షసులను హతమార్చితిని. అప్పుడు నేను వేగముగా ఆ నగరద్వారమును ఎక్కితిని. అప్పుడు నేను కాలాగ్ని జనులను దహించిన రీతిలో సాట్టప్రాకారములతో గోపురములతో కూడిన ఆ లంకా నగరమును మండుతున్న తోకతో దగ్ధము చేసితిని'.

'ఆ దహనము పిమ్మట అక్కడ దహింపబడని ప్రదేశము లేకపోవుటచే జానకి కూడా నష్టపోయెనేమో అని భయము వచ్చెను. "ఆ నగరమంతయూ భస్మము చేయబడినది. నాచేత లంకా దహనము చేయబడినది. సీత తప్పకుండా దహించబడి యుండవచ్చు. నా చేత ఈ రామునియొక్క మహత్తరమైన కార్యము నాశనము చేయబడినది"అని అనుకొంటిని.

'ఈ విధముగా శోకములో మునిగి పోయి నేను చింతనలో పడితిని. అప్పుడు నేను "సీత దగ్ధము కాలేదు" అన్న చారణుల శుభాక్షరములకూడిన మాటలను వింటిని. "అద్భుతము జానకి దగ్ధము కాలేదు", అన్నఆ మాటలను విని పూర్వపు శుభశకునములతో, ఆమె దహింపబడలేదని నిశ్చయమునకు వచ్చితిని ".

'లాంగూలము నకు నిప్పంటించబడినప్పటికీ అగ్ని నన్ను దహించలేదు. నా హృదయము ఆనందభరితమై యున్నది. వాయువులు సువాసనభరితమై యున్నవి. ముందు కనపడిన శకునములతో ఋషివాక్యములతో సిద్ధులవాక్యములతో సఫలములైన కారణములచేత నేను మనస్సులో ఆనందభరితుడనైతిని'.

'వైదైహిని మరల చూచి ఆమె అనుమతి తీసుకొని నేను మరల అరిష్ట పర్వతము చేరి మీ అందరి దర్శన కాంక్షతో తిరిగి ప్రయాణమునకు ఎగురుట ప్రారంభించితిని".

'అప్పుడు నేను వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులుసంచరించే గగన మార్గములో పయనించి ఇక్కడ మిమ్మలనందరినీ చూచితిని. రాఘవుని ప్రభావము చేత మీ ఉత్సాహముతో సుగ్రీవుని కార్యము సాధించబడినది".

'ఇది అంతా నాచేత యథా తథముగా చెప్పబడినది. మిగిలిన చేయబడని కార్యము ఇంకా మనము చేయవలసిన కార్య శేషము గురించి చూడవలెను' అని.

ఆ విధముగా హనుమంతుడు తన లంకకు వెళ్ళిన వృత్తాంతము జాంబవదాది వీరులకు చెప్పెను.

ఈ విధముగా వాల్మీకి చే రచించబడిన రామాయణములో సుందరకాండలో ఏభై ఎనిమిదివ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| ఏతత్సర్వం మయా తత్ర యథావదుపపాదితమ్||166||
అత్రయన్న కృతం శేషం తత్ సర్వం క్రియతామితి || 167||
స|| ఏతత్ సర్వం తత్ర మయా యథావత్ ఉపపాదితం అత్ర| యత్ నకృతం శేషం తత్ సర్వం క్రియతామ్||
తా|| ఇది అంతా నాచేత యథా తథముగా చెప్పబడినది. మిగిలిన చేయబడని కార్యము ఇంకా మనము చేయవలసిన కార్య శేషము గురించి చూడవలెను.
|| ఓమ్ తత్ సత్||